కలియుగకర్మయోగి - ఎక్కిరాల కృష్ణమాచార్యయ


గురుదేవులు కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాల సందర్భంగా ( 1926 - 1984 )

ఆధ్యాత్మిక సాధకులు, సత్యాన్వేషకులు, ముఖ్యంగా తెలుగువారు ప్రేమతో, అభిమానంగా మాస్టర్ ఇ. కె. అంటూ పిలుచుకొనే ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి జన్మస్థలం బాపట్ల. శ్రీమతి బుచ్చమ్మ, ఎక్కిరాల అనంతాచార్య దంపతులకు 11 - 8 - 1926 న జన్మించేరు. కృష్ణమాచార్యుల వారి తాతగారి పేరు గట్టుపల్లి శ్రీనివాసాచార్యులు, శ్రీమతి చూడమ్మ దంపతులు. వీరు 'జలార్గళ' విద్యకు పెట్టింది పేరు. హోరా, ప్రశ్న, సాముద్రిక, శకున శాస్త్రము లందు ఆరితేరిన వారు. కృష్ణమాచార్యుల తండ్రిగారి పేరు గట్టుపల్లి అనంతాచార్య. వీరి తండ్రి మరణించడంతో ఎక్కిరాల రంగమ్మ గారు అనంతాచార్యను దత్తత తీసుకొనడంతో నాటి నుండి వీరి పేరు ఎక్కిరాల అనంతాచార్యగా మార్పు చెందింది. శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్య గారి బాల్యం గురించి చెప్పాలంటే వీరు తల్లి గర్భంలో ఉన్న సమయంలో వీరి తండ్రిగారు కృష్ణ తత్త్వం మీద అధ్యయనం చేస్తుండే వారు, విశేషంగా భగవద్గీతపై. తల్లి కూడా కృష్ణ భక్తురాలు. ఇరువురి కృష్ణ భక్తికి ఫలితం కృష్ణమాచార్య గారి జననం. మాస్టర్ గారు కొంచెం పెద్ద వారైన తర్వాత ఇంటికి చుట్టాలొచ్చే రంటే వారికి మద్రాసు అంతా చూపించే పని మాస్టర్ గారిదే. ఒకసారి వారింటికి 'బ్రహ్మ సమాజం' సభ్యులొచ్చారు. వారికి విగ్రహారాధన పద్ధతి లేదు. ఇది తెలియని మాస్టర్ గారు పార్థ సారథి దేవాలయానికి తీసుకు వెళ్తానని చెప్పారుట. మాకు విగ్రహారాధన లేదని, సర్వము నందూ భగవంతుని దర్శిస్తాము అనగానే మాస్టర్ గారు, మరి అన్నింటిలోనూ భగవంతుడు ఉంటే విగ్రహాల్లో ఉండడా ? అని అడిగేటప్పటికి వారికి కనువిప్పు కలిగింది, పిల్లవాడు చెప్పింది కరెక్టే కదా అని పిల్లవాని సమయస్ఫూర్తికి ఎంతగానో మెచ్చుకుని గుడికి వెళ్ళేరుట.


ప్రథమ సంతానమైన ఎక్కిరాల కృష్ణమాచార్య చిన్ననాటి నుండే అనగా 7 సంవత్సరాల వయసు నుండే గాయత్రీ మంత్రాన్ని ధ్యానించే వారు.13 వ యేట తల్లిని కోల్పోయిన కృష్ణమాచార్య తన ముగ్గురు తమ్ముళ్ళ బాగోగులు చూచుకోవటంలో తల్లి పాత్రను పోషించారు. 18 సంవత్సరాల వయసు లోనే 'అర్పణ', 'ఋతుగానం' అనే కావ్యాలు రచించారు. నాటి కవిసామ్రాట్ అయిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారికి వీటిని చూపించగా " ఈ కవిత్వం లోని భావాలు చాలా బాగున్నాయి. ఈ అబ్బాయి ప్రతిభ బహు ముఖంగా ఉంటుంది" అని ఎంతగానో ప్రశంసించారుట. B.A చదువుతున్న రోజుల్లో ఒక రోజు రాత్రి, అదే కార్తీక పౌర్ణమి నాటి రాత్రి సాగర తరంగాలపై పడుతున్న వెన్నెల శోభను చూచి తన్మయత్వంలో 'రాసలీల' అనే మధుర కావ్యాన్ని రచించారు. తెనాలి రామకృష్ణ కవి వ్రాసిన పాండురంగ మహాత్మ్యం - కావ్యం పై పరిశోధన చేసి డాక్టరేట్ పొందేరు. ఆంధ్రా యూనివర్సిటీలో ఆచార్యునిగా తెలుగు పాఠాలు చెప్తూనే అంతటితో ఆగకుండా ఎన్నో విషయాల మీద ఎంతో జ్ఞానాన్ని అందించేవారు. కృష్ణమాచార్యుల రచనల ముఖ్య ఉద్దేశ్యం సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ఉండాలి. మాస్టర్ గారు ఏ విషయా న్నైనా ధైర్యంగా చెప్పేవారు. అటు ఆకాశమంత ఎత్తు, ఇటు సామాన్యులతో కలిసి జీవితం, మూర్తీభవించిన మానవతా దృక్పథం. మానవునిగా వచ్చి ఏం చేయాలి, ఎలా జీవించాలి అన్నది వేదం చెప్పింది, అలా నడుచుకోగలిగే ధైర్యాన్ని అందరికీ అందించి తాను ఆచరించి చూపిన మహానుభావులు.


తండ్రి వద్దనే వేదాధ్యయనం, ఉపనిషత్తులు,పంచకావ్యాలు ఇంకా అనేక సంప్రదాయ విషయాలు నేర్చుకున్నారు. 21 వ. సంవత్సరంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షల్లో అద్భుతమైన విజయంతో ఉత్తర్ణులయేరు. చిన్నప్పటి నుండే ప్రారంభమైన గాయత్రీ మంత్ర ధ్యానం వారితో పాటు పెరుగుతూనే వచ్చింది. కొంత కాలానికి గాయత్రి దేవి విగ్రహంలో క్రింది భాగం బలమైన వ్యక్తిగాను, పై భాగంలో గాయత్రీ మాతగాను ధ్యానంలో దర్శనం కలిగేది, కాని వ్యక్తి ఎవరో తెలియ లేదు. కొద్దిరోజుల తర్వాత వేరే ఊరిలో ఉన్న తన స్నేహితునితో ప్రార్థనా మందిరంలో ఉన్న చిత్ర పటాన్ని చూడగానే కృష్ణమాచార్య ఒళ్ళు ఝల్లుమంది. ఎందుకంటే ఆ ఫొటోలో ఉన్నది తనకు రోజూ ధ్యానంలో కనిపించే వ్యక్తిదే ! తన స్నేహితుడు రాజగోపాల రావు "నమస్కారం మాస్టర్ C.V.V " అనగానే కృష్ణమాచార్య వెన్నెముక అంతా చిత్రమైన సంచలనం కలిగింది. శరీరమంతా విద్యుత్ తరంగాల స్పర్శ కలిగింది. ఇటువంటి అనుభవం 16 సంవత్సరాల వయసులోను, అంతకుముందు 5 సంవత్సరాల వయసులోనూ కలిగింది. ప్రేయర్ పూర్తయే సరికి శరీరం తేలికై ప్రశాంతత అనిపించింది


C.V.V గారి పూర్తిపేరు కంచుపాటి వెంకటరావ్ వెంకాస్వామి రావ్. C.V.V గారి యోగమార్గం వివరాలను స్నేహితుని అడిగి తెలుసుకున్నారు. ఒకరోజు ఆ వ్యక్తి ధ్యానంలో "నేను ఒక మహత్తర కార్యం కోసం నిన్ను ఎన్నుకున్నాను. ఇకపై నీలో నుండి బోధిస్తూ ఉంటాను. నేను అందించే సూచనల మేరకు నడుచుకో గలవు" అని వినిపించింది. పరమ గురువుల దివ్య ప్రణాళికలో భాగం కావడానికి శ్రీ కృష్ణమాచార్య తన సుముఖతను వ్యక్తం చేశారు. దివ్య ప్రణాళికలో తన పాత్ర ఏమిటో కృష్ణమాచార్య గ్రహించ గలిగేరు. అప్పటి నుండి C.V.V గారు ధ్యానం లో కనుపించి సంభాషించే వారు. 1953 నుండి 1965 వరకు ఈ విషయాన్ని పూర్తి గోప్యంగా ఉంచారు. వారు1962 జనవరి 11,12,13, తేదీలలో మొదటిసారిగా గురుపూజా మహోత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుండే రచనా వ్యాసంగం మొదలైంది. 'మిహిర' అనే జ్యోతిష మాస పత్రికను నిర్వహించేవారు.

భగవద్గీత ఒక అలౌకికమైన దేవగానం. ఇది శాశ్వత సత్యాన్ని చేరుకోవడానికి 18 తాళం చెవులు కలిగిన గ్రంథం. భగవానుడు మానవజాతికి నేరుగా ఉపదేశించిన గ్రంథమిది. ఆయన రచన "శంఖారావం" - భగవద్గీత పై అద్భుత వ్యాఖ్యానం. “మంద్ర గీత” ఆత్మ సంబంధమైన పురోగతిని కోరుకొనే వారికి ఒక 'దిక్సూచి' అని అంటుండేవారు.

బాలల పుస్తకాల దగ్గర నుంచి బ్రహ్మ సూత్రాల వివరణ వరకూ ఆయన రచనా పరిధి అనన్యం ! "భాగవత రహస్య ప్రకాశము" జీవితాన్ని పిండి రూపొందించిన రసాయనం ! వేద సూక్తాలకు గావించిన వివరణలు వెన్నెల తునకలు ! "గోదాదేవి కావ్యం" మరో ఆముక్తమాల్యద, మధుర భక్తి కావ్యం. ఇందు గోదాదేవిగా తన తల్లియే సాక్షాత్కరించిన అనుభూతి ! "రాసలీల" లోని పద్యాలు రస గుళికలే ! "క్రీడామయుడు", "పురాణ పురుషుడు" చదువు తున్నప్పుడు గోవులు వచ్చి చుట్టూ చేరేవి, పఠనం ఆగిన వెంటనే వెళ్ళిపోయేవి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో !


1971 సంవత్సరంలో జగద్గురువు మైత్రేయుల నామాంకితముగా ఆధ్యాత్మిక మార్గాన్ని పరివ్యాప్తి చేయడానికి జగద్గురు పీఠమును స్థాపించేరు. మాస్టర్ గారి జ్ఞాన బోధనకు ప్రభావితులైన ఆల్బర్ట్ శశి, విదేశములకు వచ్చి తమ బృందములకు కూడ ఈ విజ్ఞానాన్ని అందించ వలసినదిగా పదేపదే కోరడంతో వారి ఆహ్వానాన్ని మన్నించి ప్రాక్ పశ్చిమ సమన్వయ యజ్ఞం లో భాగంగా 1972 లో బెల్జియంకు ప్రయాణించేరు. 2 నెలల పర్యటనలో స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, హాలెండ్ దేశాలు పర్యటించారు. ఈ విధంగా 1972 నుండి 1983 సంవత్సరముల మధ్య 7 మార్లు ప్రాక్ పశ్చిమ సమన్వయ యాత్ర చేశారు


మాస్టర్ గారికి ప్రతి విషయంలోను సంపూర్ణ సహకారమును అందించిన వారు మాస్టర్ గారి ధర్మపత్ని అప్పమ్మ గారు. అనుయాయు లను అందరినీ తల్లివలె ఆదరించి, ఆత్మీయమైన స్నేహంతో దగ్గరకు తీసుకున్న ఆమెను అందరూ ఆప్యాయంగా 'అక్కయ్య గారు' అని సంబోధించే వారు. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరూ మాస్టర్ గారి అడుగుజాడలను అనుసరించినవారే !
ఈ కాలంలోనే మాస్టారుగారు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. తన రెండవ కుమారుడు తీవ్రమైన అనారోగ్యంతో ( మూర్ఛ ) బాధ పడుతుండగా అలోపతి, ఆయుర్వేదం వైద్యాలు ఎటువంటి ఉపశమనం ఇవ్వకపోవడంతో హోమియోపతి వైద్యుడైన తన స్నేహితుని సహాయంతో చికిత్స ప్రారంభించి, ఆరోగ్యం క్రమంగా మెరుగు పడటంతో, మాస్టర్ గారికి హోమియోపతి వైద్య విధానం పట్ల ఆసక్తి పెరిగి తెలుసుకోవాలనే కోరిక పుట్టింది. ఈ ప్రయత్నంలో అనేక కొత్త విషయాలు కను గొన్నారు. ఈ నూతనంగా గ్రహించిన హోమియో అవగాహనతో కొద్ది కాలంలోనే స్నేహితులు, బంధువులు, చుట్టుపక్కల ఉన్న వారు వీరి వద్ద హోమియో మందులు తీసుకోవడం ప్రారంభించారు. ఈ సమాచారం ఆనోటా ఈనోటా వ్యాపించడంతో అన్ని ప్రాంతాల ప్రజలు ఈయన వైద్యం కోరసాగేరు. ఇక హోమియో వైద్యంతో ఆజన్మాంతము ఇతరులకు సేవ చేయవచ్చుననే సత్సంకల్పం మాస్టర్ గారికి కలగడానికి ఈ సంఘటన ఒక ప్రేరణగా నిలిచింది.


విద్య, వైద్యం వ్యాపార వస్తువులైపోయి, ప్రమాణాలు దిగజారిపోవడం గమనించి మాస్టర్ గారు ఆదర్శవంత మైన విద్యా ప్రణాళికతో 'జనకులము' ,'బాలభాను' విద్యాలయాలను ప్రారంభించారు. అదేవిధంగా - రోగార్తులకు భౌతిక, మానసిక ఆరోగ్యమును సాధించడానికి, నిస్వార్థముగ వైద్య సేవ చేయడానికి సామాన్యులకు మెరుగైన వైద్యం అందుబాటు లో ఉండాలని ఉచిత "మాస్టర్ హోమియో వైద్యాలయము లను" నెలకొల్పారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొల్పిన వందలాది మాస్టర్ హోమియో వైద్యాలయాలు వేలాది మందికి అవసరమైన ఉచిత సేవలు అందిస్తున్నాయి. ఒకవైపు ఉద్యోగం, ఇంకోవైపు Homoeopathy శిక్షణ తరగతులు, మరోవైపు Homoeopathy ఉచిత వైద్య సేవ, ఇంకనూ ధార్మిక ప్రసంగాలు, మరోవైపు జగద్గురు పీఠం స్థాపన, దేశమంతటా జగద్గురు పీఠ బ్రాంచీల విస్తరణ, సాహిత్య సమావేశాలు ఇలా అలుపు లేని సంచారం. 30 సంవత్సరాల పాటు రోజుకి 18 గంటలు పని చేసేవారు. మోతుగూడెం అనే మారుమూల అటవీ ప్రాంతంలో యోగా శిక్షణా తరగతులను నిర్వహిస్తూ చివరి వారంలో మాస్టర్ గారికి, మరి కొందరు అనుయాయులకు మలేరియా విష జ్వరం సోకి ఆరోగ్యం విషమించిన కర్మ యోగి మాస్టర్ ఇ.కె గారు 17-3-1984 పౌర్ణమి రోజున తన భౌతిక కాయాన్ని విడిచి పెట్టారు.

భుక్తి, ముక్తి ప్రదాతేన తస్మై శ్రీ గురవే నమః


నిస్వార్థ మైన సేవ వల్ల మాత్రమే పాప ప్రక్షాళన, కర్మానుభవములు తొలగుతాయి తప్ప, మరే విధమైన ఆరాధనలతోను సాధ్యము కాదని చెప్తూ, నిస్వార్థ మైన సేవా మార్గాన్ని మాత్రమే వారు బోధించేవారు . సాధారణ మానవులు సైతం ప్రజ్ఞామయంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడపటం సాధ్యమేనని ఆచరించి నిరూపించిన మహామనీషి ! సామూహిక సహజీవనం లోని సంతోషాన్ని సంతృప్తిని ఆచరణాత్మకంగా చేస్తూ చూపించి ఆ మార్గంలో నడిపించడానికే తన జీవితాన్ని అంకితం చేసిన కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గురువులకు శత సహస్ర వందనాలు.

ముచ్చటగా మూడు ముక్కల్లో చెప్పాలంటే :

శ్రీమాన్ కులపతిఎక్కిరాల కృష్ణమాచార్యుల వారిపేరు తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే వారు ఉచిత హోమియో వైద్య సేవ చేసి లక్షలాది ప్రజలకు స్వస్థత చేకూర్చిన, అపర ధన్వంతరి గా పేరుగాంచిన పుణ్యమూర్తి. హోమియోపతి శిక్షణ నిర్వహించి ఎందరినో హోమియో వైద్యులుగా తీర్చిదిద్దిన మహనీయులు. వీరివద్ద శిష్యులు వేద, జ్యోతిష, క్రతువిద్య, యోగ శాస్త్ర ములందు సుశిక్షితులై బాగుపడిన కుటుంబాలు ఎన్నో!


హోమియోపతి ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించి ఎందరినో హోమియోపతి వైద్యులుగా తీర్చిదిద్దిన మహనీయులు. అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ అయిన జగద్గురు పీఠమును (World Teacher Trust) స్థాపించి అనేక దేశాల ప్రజలను ఆధ్యాత్మిక చైతన్యవంతులు గా గావించిన పుణ్యమూర్తులు. కృష్ణమాచార్యుల వారు ఎప్పుడూ ' సత్కర్మాచరణమే నా పూజా విధానము ' అంటుండేవారు. వారి వద్ద హోమియోపతిలో నిష్ణాతులైన శిష్యులు ఎందరో వైద్యులుగా సేవలందిస్తున్నారు. మాస్టర్ ఇ.కె గారి హోమియో వైద్యము ను యథాతథముగా నేర్చుకున్న వారి ప్రముఖ శిష్యులు డా : కొంపెల్ల సత్య నారాయణ శాస్త్రి గారు (Dr. K.S.S). వీరి గురుభక్తి అపారమైనది. గురువుగారి గురించి చెప్తూ పరవశించి పోయేవారు. కృష్ణమాచార్యుల వారు హోమియోపతి వైద్యాలయమును నెలకొల్పి నడిపించిన తీరులోనే శాస్త్రి గారు కూడా అదే సేవాభావం తో, అదే క్రమశిక్షణతో నడిపించు కొచ్చేరు. 90 సంవత్సరాల వయసులో కూడా వైద్యాలయానికి వెళ్ళి మందులిచ్చేవారు. మొత్తం జీవితాన్ని గురువు చూపించిన మార్గంలోనే నడిపించుకొచ్చేరు. శాస్త్రి గారు తమ గురువు గారైన మాస్టర్ ఇ. కె. గారి సమయంలో ఉచిత హోమియో వైద్యాలయం ఎంత ఉన్నతంగా నడిచేదో అదే విధంగా ఏ మాత్రం విలువలు, క్రమశిక్షణ తగ్గకుండా తన జీవిత పర్యంతం నడిపించ గలిగిన మరో మహనీయులు. గురువుగారి అడుగు జాడల్లోనే నడుస్తూ అదే విధంగా ఎంతమందికో హోమియో వైద్యం నేర్పి హోమియో వైద్యులుగా తీర్చి దిద్దారు. ఎన్నో ఉచిత హోమియో వైద్యాలయాలను వారి పర్యవేక్షణలో నడిపింప చేసేవారు. అదే విధంగా మాస్టర్ ఇ.కె గారి శిష్యులందరూ అదే సేవాభావంతో వారి బాటలోనే నడుస్తూన్నారు. అలాగే జ్యోతిర్విద్య నేర్చుకున్నవారు, వేదము నేర్చుకున్న వారు, పూజా విధానము నేర్చుకున్న వారు అందరూ వారి అడుగుజాడల్లోనే నడవటం గమనించగా వారి సంకల్పం ఎంత గొప్పదో అర్ధమవుతుంది


మనం చెయ్యవలసినవి మూడు అంటుండేవారు.
1. ప్రార్థన చేయటం 2. దేహి అని చేయి పట్టకపోవట 3. అందరిలో గురువును దర్శించడం

శ్రీమాన్ కృష్ణమాచార్యుల వారి చివరి ఉపన్యాసం
నాకు తెలిసిన విద్యలను మీకు ఇచ్చినాను. నేను ఎప్పుడూ ఎవరినీ గురుదక్షిణ కోరలేదు. ఈ రోజున గురు దక్షిణ కోరు తున్నాను. అదేమిటంటే నేను ఇప్పటి వరకు ఇచ్చిన శిక్షణ ప్రకారం జీవిస్తూ , మీకు నేర్పిన విద్యను బాగుగా అభ్యసించి, మీరు ఒక్కొక్కరు కనీసం మరో పదిమందికి చొప్పున జీవితాంతము శిక్షణ ఇస్తూ ఇదే గురుదక్షిణ మీరు కూడా పొందండి. ప్రపంచం నలుమూలలా వెదజల్లండి.

అనుచరులకు ఇచ్చిన చరమ సందేశం
మీరు నన్ను నమ్ముట కన్నా ఒకరినొకరు నమ్ముట ఎక్కువ ముఖ్యం. దానితో నేను మీలో నుండగలను.
కారుణ్య సార సాన్ద్రాః కాంక్షిత వరదాన కల్ప విశేషాః |
శ్రీ గురు చరణ కటాక్షాః శిశిరాః శమయన్తి చిత్త సంతాపమ్ ||
పరమ కరుణారస పూర్ణములై కల్ప వృక్షముల వలె కోరిన కోరికలు కురుయు నట్టి శ్రీ గురు పాదుల చల్లని కటాక్షములు హృదయ తాపమును చల్లార్చును


డా : ఈ. కె. గారి రచనలు
1. యోగ ప్రసంగములు
2. తైత్తిరీయోపనిషత్తు
3. నారద భక్తి సూత్రములు
4. నారాయణ కవచము
5. ఆముక్తమాల్యద
6. రామాయణ ప్రసంగములు
7. లలితా సహస్రనామ రహస్య ప్రకాశము
8. స్వర్ణ రసాయన విద్య
9. రుద్ర సూక్తము
10. సరస్వతీ సూక్తము
11. అశ్వనీ దేవతలు
హోమియోపతీ రచనలు
1.హోమియో శరీర గుణదీపిక
2.హోమియో గృహ వైద్యము
3.హోమియో వైద్యవిధానము
4. హోమియో తత్వ శాస్త్ర ప్రసంగములు
5. హోమియో ప్రబోధం…. మొదలైనవి
12. మంద్ర జాలము
13. నల దమయంతులు
14. విష్ణు సూక్తము
15. అగ్ని సూక్తము
16. పురుష మేధము
17. పురాణ పురుషుడు
18. క్రీడా మయుడు
19. శ్రీ సూక్తము
20. పురుష సూక్తము…. మొదలైనవి
ఇంగ్లీష్ లో 40 పైనే ఉన్నాయి.

కృష్ణ మాచార్య గారి వచనములు

1. గ్రహించవలసినది దివ్య జీవనము. ఆచరించ వలసినది కర్తవ్వము. విడిచిపెట్ట వలసినది సుఖదుఃఖముల అనుభవం.
2. శాస్త్ర శాఖల విజ్ఞానము తలపై అరటిపండ్ల గెలను మోయటం వంటిది. ఆధ్యాత్మిక జీవనం అరటిపండ్లు తాను తినుట వంటిది.
3. కారణము లేకయే ఇతరులను సుఖపెట్టువారు, కారణము లేకయే సుఖపడుదురు.
4. సహకరించి బ్రతకాలి తప్ప ఆశ్రయించి బ్రతుక కూడదు. అలసత్త్వాన్ని, దీనత్త్వాన్ని పొందరాదు.
5. మంచి పనులను ఆచరించుట కన్నా చేయించుట ఎక్కువ కష్టము. అయితే ఆచరించనిచో చేయించుటకు సామర్థ్యము కలుగదు, అనగా ఆచరించు వాడు మాత్రమే మంచిపనులు చేయించగలడు.
6. సత్ప్రవర్తన తన కోసమే కాని ఎదుటివారి కొరకు కాదు. ఉదా : కత్తిని రాతిపై నూరుట కత్తిని షార్ప్ చెయ్యటానికే కాని రాతిని నునుపు చెయ్యటానికి కాదు కదా
! 7. బాధ్యతలను స్వీకరించి ఆచరించుము, భయపడకుము. బాధ్యతతో కర్తవ్యము ఆచరించిన ఆత్మవికాసము కలుగును.
8. వేదము గొప్పదని గర్వించుట కన్న వేద సంప్రదాయము ననుసరించి జీవించుట శ్రేష్టము.
9. ప్రపంచమున అన్ని దేశములలోను ఉన్నది సనాతన ధర్మమే గాని మతము కాదు.
10. వచ్చే పరిస్థితులు దైవదత్తాలుగా ఎరిగి కర్తవ్యాన్ని దైవారాధన గా ఆచరించి చూడండి, జీవితం గంధపు చెక్కలా తయారవుతుంది.
11. ఏ క్షణం లోనైనా, ఏమైనా ఎక్కడైనా, ఎలాగైనా జరుగవచ్చును. ఇలా జరిగి తీరాలి అని గాని, ఇలా జరుగడానికి వీల్లేదు అనేది కాని ఉండదు. అంతా సర్వాంతర్యామి స్వరూపమైన కాలపురుషుని మహిమ అని మనము గమనించాలి. ఏమి జరిగినా అది *వాని లీల* గానే భావించి మనము నిలబడ గలగాలి.

 
 
Design by The Colour Moon